సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోబుతున్నారు. రవీంద్రభారతి వేదికగా శనివారం ఉదయం నిర్వహించే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో వీరిద్దరూ పాల్గొననున్నారు.సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి ఈనెల 12న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ క్రమంలోనే అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.
సీఎం రేవంత్‌తో పాటు కేటీఆర్‌ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.తమ్మినేని ఆహ్వానం మేరకు రేవంత్,కేటీఆర్ ఇద్దరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే, వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు హాజరవుతారా? ఒకేసారి వేదికను పంచుకుంటారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఒకేసారి హాజరైతే ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతాయా? సంస్మరణ సభ కావున హుందాగా వ్యవహరిస్తారా? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరూ ఒకేసారి వేదికను పంచుకోనుండటంతో ఏం జరుగుతుందో అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.