తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తుండగా, ‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ కంపెనీలతో పాటు అధునాతన పరిశ్రమలన్నింటికి అందుబాటులో ఉన్నందున గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈఎస్‌సీఐలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించిన సీఎం అక్కడే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చలు జరిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్‌బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ,అప్పటివరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు అందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా లభించేలా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలని ఆయన ఆదేశించారు. స్కిల్ వర్సిటీ ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి అంశాలు మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని సూచించారు.