మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
14ఏండ్ల వయస్సు కలిగిన బాలబాలికలు రాత్రంతా బీచ్‌లో గడపటంపై తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని గోవా అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. పిల్లలు మాట వినలేదని, ప్రభుత్వం, పోలీసులపై బాధ్యతను మోపలేమన్నారు. తమ పిల్లలను భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని పేర్కొన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పిల్లలను అందులోనూ మైనర్లను బయటకు వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
హోం మంత్రిత్వశాఖ కూడా సీఎం ప్రమోద్ సావంత్ దగ్గరే ఉండటం గమనార్హం.
గోవా సీఎం ప్రమోద్ సావంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆల్టోన్ డికోస్టా తప్పు పట్టారు. గోవాలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. రాత్రుల్లో బయట తిరగడానికి ఎందుకు భయపడాలి? నేరస్తుల జైలులో ఉండాలి. అప్పుడు చట్టాన్ని గౌరవించే పౌరులు స్వేచ్ఛగా బయట తిరుగుతారని పేర్కొన్నారు.