వంటనూనెల ధరల కట్టడికి.. కేంద్రం మరో కీలక నిర్ణయం

-

వంటనూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను మార్చి 2023 వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ఆదివారం ప్రకటించింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఉపశమనాలను మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు దిగొస్తున్నాయని.. ఫలితంగా దేశీయంగానూ ధరలు అదుపులోకి వస్తున్నాయని పేర్కొంది. దీనికి సుంకాల రాయితీ కూడా జతకావడంతో భారత్‌లో ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపింది.

తాజా నిర్ణయంతో ముడి, రిఫైన్డ్‌ పామాయిల్‌; ముడి, రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్‌; ముడి, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ నూనెలపై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం ముడి రకాల నూనెలపై సున్నా శాతం దిగుమతి సుంకం ఉంది. అయితే, వ్యవసాయం, సామాజిక సంక్షేమ సెస్సులతో కలిపి మొత్తంగా వీటి దిగుమతిదారులు 5.5 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. అలాగే రిఫైన్డ్‌ పామాయిల్‌ దిగుమతిపై 13.75 శాతం; రిఫైన్డ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలపై 19.25 శాతం పన్ను విధిస్తున్నారు.

గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. భారత్‌ తన అవసరాల్లో 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో దేశీయంగానూ ధరలు కొండెక్కాయి. అందువల్లే సామాన్యులపై భారం తగ్గించేందుకు కేంద్రం పలు దఫాల్లో దిగుమతి సుంకాన్ని తగ్గించింది. భారత్‌ 2020-21 అక్టోబరుతో ముగిసిన ఆయిల్‌ మార్కెటింగ్‌ ఏడాదిలో రూ.1.17 లక్షల కోట్లు విలువ చేసే వంటనూనెల్ని దిగుమతి చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version