తెలంగాణ : కాంగ్రెస్ అధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు ..

నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సత్యాగ్రహ దిక్ష ప్రారంభించనుంది. గాంధీ భవన్ వేదికగా సత్యాగ్రహ దీక్ష మొదలు కానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కి మెమోరాండమ్ కూడా అందించారు. కరోనా వ్యాక్సినేషన్ తో పాటు బ్లాక్ ఫంగస్ కి కూడా ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా నుండి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. డయాబెటిస్ తదితర అనుబంధ వ్యాధులున్న వారు బ్లాక్ ఫంగస్ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనాకి ఉచిత వైద్యం అందించడంతో పాటు బ్లాక్ ఫంగస్ కి కూడా ఉచితంగా వైద్యం అందించాలని సత్యాగ్రహ దీక్ష ప్రారంభిస్తున్నారు. ఈ దీక్షలో కాంగ్రెస్ నేతలు అందరూ పాల్గొంటున్నారు.