కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపధ్ ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ దీక్ష ప్రారంభం కానుంది. పార్టీ ఎంపీలతో పాటు వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసిసి ఆఫీసు బేరర్లు పాల్గొననున్నారు.
కాగా అగ్నిపథ్ పూర్తిగా దిశ, దశ లేని పథకం అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ ప్రకటనలో విమర్శించారు. పోరాటాన్ని యువత శాంతియుతంగా కొనసాగించాలని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాదులోని గాంధీభవన్లో కూడా సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీక్ష వివరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపధ్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవమానపరుస్తున్నారు అని మండిపడ్డారు.