కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిల విమర్శలు గుప్పించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి.కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరని పుష్కర్ సింగ్ ధామి అన్నారు.నర్సంపేటలో సోమవారం బీజేపీ భారీ బహిరంగ సభ లో మాట్లాడుతూ… కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపును బీజేపీ తెచ్చిందని అన్నారు.
సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసునని ఆదివాసీ, గిరిజన ప్రజలకు అండగా ఉంటారని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. దేశాన్ని డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటి పడేలా నిలిపారని అన్నారు. రిజర్వేషన్లపై, బీజేపీపై కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ, 6 గ్యారెంటీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. మోసపూరిత హమీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని చెప్పారు .ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు.