ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. మోడీకి ఆయన ఉపయోగించే డ్రోన్ల వల్ల దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది. డ్రోన్ల సాయంతో దేశవ్యాప్తంగా జరిగే అభివృద్ధి పనులపై తాను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నానని మోడీ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడింది.
కరోనా సంక్షోభంలో ప్రజల ఆకలి కేకలు, మరణాలను ప్రధాని మోడీ డ్రోన్ చూడలేకపోయిందని పేర్కొంది. బీజేపీ ఎజెండాకు ఏది అవసరమో.. వాటినే ప్రధాని డ్రోన్ చూడగలిగిందని కాంగ్రెస్ ప్రతినిధి సునీల్ అహిరె ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. చైనా ఆక్రమణ సమయంలో మోడీ డ్రోన్లు చూసిచూడనట్లుగా ఎందుకు వ్యవహరించాయని ఆరోపించారు. చైనా ఆక్రమణలు, చైనా బ్రిడ్జిలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా గ్రామాలను ఎందుకు చూడలేకపోయిందని పేర్కొన్నారు. కాగా, భారత్ డ్రోన్ మహోత్సవ్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రక్షణ, విపత్తు, వ్యవసాయం, పరిశ్రమ, ఉపాధి, క్రీడా రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరగాలని ఆకాంక్షించారు.