కంచుకోటలో జానారెడ్డి పట్టు నిలుపుకుంటారా..కాంగ్రెస్ ముందున్న అసలు సవాల్ ఇదే

-

నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడి నుంచి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కి చావో రేవో గా మారడంతో పెద్దాయన గెలు పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. రేపటి రోజున కాంగ్రెస్‌ పుంజుకుంటే ఉన్నత పదవి లభించే అవకాశం ఉండటంతో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు జానారెడ్డి.

గతంలో చలకుర్తి పేరుతో ఉన్న నియోజకవర్గం 2009లో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలు ఉన్నాయి. 1967 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా 7 సార్లు రెడ్డి సామాజిక వర్గం, 5 సార్లు బీసీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సాగర్ నుంచి జానారెడ్డి 7 సార్లు ఎమ్మెల్యే గా విజయంసాధించారు. 11వ సారి నామినేషన్ వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు జానారెడ్డి.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌కి మళ్లీ ఏ విజయం దక్కలేదు. కంచుకోటలాంటి హుజూర్‌నగర్ తో పాటు దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసింది. దీంతో కాంగ్రెస్ నాయకత్వానికి నాగార్జునసాగర్ ఎన్నిక సవాల్ విసురుతుంది. 2023 ఎన్నికలకు శక్తిని కూడదీసుకోవాలంటే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో జానారెడ్డి తప్పక గెలవాలన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.

దుబ్బాకలో గెలుపు..గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తర్వాత కాంగ్రెస్ లో కొంత గుబులు మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వెనకబడటంతో కాంగ్రెస్‌ నాయకులు కాస్త తేలిక పడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులంతా జానారెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. సాగర్‌లో ఆయన గెలిచి అసెంబ్లీకి వస్తే.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడం కాంగ్రెస్‌కే సాధ్యం అని చెప్పినట్టు అవుతుంది. ఆయన వల్ల పార్టీ నిలబడింది అన్న చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. వరస ఓటములతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌కు జానా గెలుపు గొప్ప బూస్టింగ్ ఇస్తుంది అనుకుంటున్నారు.

సిట్టింగ్ సీటు దుబ్బాకలో ఓటమితో సాగర్ లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది టీఆర్ఎస్.నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆరెస్ మధ్యనే ఉంటుంది మరి ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news