సాగర్ బైపోల్: కాంగ్రెస్ సర్వేలోనూ తేలింది‌ ఇదేనా

-

తెలంగాణ కాంగ్రెస్‌కు‌ వరస ఓటములతో ఎలక్షన్స్‌ అంటేనే టెన్షన్‌ పట్టుకుంటోంది. ఈ ఎన్నికలు ఎందుకొస్తున్నాయో అని నేతలు ఒక సమయంలో ఆందోళన చెందేవారు. అలాంటిది ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూసేవారు ఎక్కువయ్యారు. ఇప్పుడు వారి దృష్టి అంతా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికపై ఉందట. నోటిఫికేషన్‌ తొందరగా వస్తే బాగుండు అని.. పీసీసీ చీఫ్‌ మార్పు వద్దనుకునేవారు ఎదురు చూస్తున్నారట. సాగర్‌లో పార్టీ గెలిస్తే ఇప్పుడున్న సారథి ఖాతాలో ఆ విజయం పడుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే పీసీసీ చీఫ్‌ ఎంపిక త్వరగా పూర్తి కావాలని ఆశిస్తున్నవారి ఆలోచన మరోలా ఉంది. పీసీసీ చీఫ్‌ను ప్రకటించిన వెంటనే ఉపఎన్నిక వచ్చి.. సాగర్‌లో గెలిస్తే.. బోణీ బాగుంటుందని అనుకుంటున్నారట.


కాంగ్రెస్‌లో రెండు వర్గాల ఆలోచన ఇలా ఉంటే.. నాగార్జునసాగర్‌లో గ్రౌండ్‌ లెవల్లో చేయాల్సిన పనులపై ఫోకస్‌ పెట్టింది పార్టీ. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అన్న దానిపై అభిప్రాయ సేకరణ చేసింది. ఇది కూడా గాంధీభవన్‌ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలి? ఏ పార్టీ బలం ఎంత అన్న దానిపై కూడా కాంగ్రెస్‌ సర్వే చేయించింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పరిస్థితి బాగానే ఉన్నట్టు ఆ రిపోర్ట్‌లో తేలిందట. రెండో ప్లేస్‌పైనే కొంత ఆసక్తికరమైన అంశాలు వచ్చాయట. ఏ పార్టీ పరిస్థితి ఏంటన్న దానిపై కంటే.. సొంత పార్టీ మీద వచ్చిన నివేదికపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్‌.

కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి బరిలో ఉంటేనే మంచి మెజారిటీ వస్తుందని సర్వేలో తేలిందట. అయితే జానారెడ్డి మాత్రం ఈ వయసులో ఎందుకు రిస్క్‌ తీసుకోవడం అన్న అభిప్రాయంలో ఉన్నారట. తన ఇద్దరు కుమారుల్లో ఒకరిని బరిలో నిలిపి గెలిపించాలని అనుకున్నారట. అయితే సీనియర్‌ నాయకులు అనుకున్నవారు ఎవరూ ఉపఎన్నికల్లో వారసులను నిలిపి రాజకీయ ఎంట్రీ చేయించరనే ప్రచారం మొదలైంది. సాధారణ ఎన్నికల్లో అయితే పార్టీ గాలి.. రాజకీయ వాతావరణం అంతా కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటారట. అందుకే ఈ ఉపఎన్నికలో జానారెడ్డే బరిలో ఉంటారన్నది పార్టీ వర్గాల టాక్‌. సర్వే నివేదిక ఆధారంగా అక్కడ జానారెడ్డి పోటీ చేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని గట్టిగా వాదిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న ఈ చర్చ చూసిన వారికి పెద్దాయనే బరిలో ఉంటారని అనుకుంటున్నారట.

సాగర్‌లో జానారెడ్డి గెలిస్తే.. వరస ఓటములతో దెబ్బతిన్న కాంగ్రెస్‌కు కొంత ఊపిరి ఇచ్చినట్టు అవుతుంది. 2023 ఎన్నికలకు మరింత శక్తి కూడదీసుకుని పోటీ చేయగలమని అభిప్రాయపడుతున్నారట. కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువ. ఇప్పుడా గ్రూపులన్ని ఐక్యంగా పెద్దాయనవైపే ఆశగా చూస్తున్నాయి. ఆయనైతే కరెక్టే.. ఆయనే పోటీ చేయాలని కోరుతున్నాయి. మరి.. జానారెడ్డి ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news