కరోనా ఎఫెక్ట్. ప్రజల జీవితాలను కబళిస్తోంది. ఈ వైరస్‌కు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు ప్రకటిస్తు న్నాయి. నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. అయితే, ఈ వైరస్ కారణంగా ప్రజలు మరణించడమేనా? అం టే.. ఔను ఈ వైరస్ సోకిన వారికి ఇప్పటి వరకు మరణం తప్ప మరో మార్గం లేదు. అయితే, వేరస్ సోకిన వారు ప్రత్యక్షంగా చనిపోతుంటే.. వైరస్ భయంతో బయటకు రాకుండా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు మానసికంగా చనిపోతున్నాయి! ఇది నిజం కూడా! కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యాన్నే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థనూ అల్లకల్లోలం చేస్తోంది. జాతి ఆర్థిక కార్యకలాపాలపై ఆ మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా వున్నది.
ప్రస్తుతం మన ఆర్థికాభివృద్ధి మందగించడానికి కొవిడ్ 19 కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు పతనం కరోనా వైరస్ ప్రబలడానికి పూర్వమే ప్రారంభమయింది. ఈ పరిస్థితులు పరిశ్రమలు, వ్యాపార సంస్థలను ప్రతి కూలంగా ప్రభావితం చేయడం ఖాయం. పెద్ద ఫ్యాక్టరీలు తమ కార్మికులను తాత్కాలికంగా తొలగిస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగాలను పూర్తిగా రద్దు చేస్తున్నారు(ఇంతవరకు చేయకపోయినా అతి త్వరలోనే అలా జరిగే అవకాశం ఎంతైనా వుంది).
ముడి పదార్థాలకు సంబంధించి బడా పారిశ్రామిక వేత్తల ఆర్డర్లు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. సరఫరాదారులు దివాలా తీస్తున్నారు. చిన్న ఉత్పత్తిదారులు నగదు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉత్పత్తిదారులకు పరపతి సదుపాయం కొరవడింది. ఇవన్నీ శీఘ్రగతిన దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ సహజ పర్యవసానాలే. ఉద్యోగాలు ప్రమాదంలో పడిన రంగాలను శీఘ్రగతిన గుర్తించి, ఆయా రంగాలలో ప్రస్తుత ఉద్యోగిత, వేతనాల స్థాయిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలి. ఆ తరువాత అసంఘటిత రంగంపై ప్రభుత్వం తన దృష్టిని నిలపాలి.
రవాణా, పర్యాటకం, నిర్వహణ, హోం డెలివరీ మొదలైన ‘నిర్మాణ’, ‘సేవల’ రంగాలలో అసంఖ్యాక ప్రజలు ఉపాధి పొందుతున్నారు. తక్కువ వడ్డీరేట్లు, పన్ను రాయితీలు, కొనుగోళ్ళను పెంచడం మొదలైన చర్యలతో ప్రభుత్వం విధిగా అసంఘటిత రంగాన్ని ఆదుకోవాలి. ఇవన్నీ కూడా కరోనా కారణంగా పరోక్షంగా ప్రభావితం అవుతున్నప్పటికీ.. సమాజంపై ప్రత్యక్షంగా ప్రభవం చూపుతున్నవి కావడం గమనార్హం.