కనీసం మాస్క్ కూడా లేకుండా కనీస ఇంగితం కూడా లేకుండా కరోనా వేళ సంక్రాంతి సంబరాలు చేసుకున్నాం మనమందరం. కరోనా భయాలు అస్సలు జనాలకు లేవు అని కూడా తేలిపోయింది అన్న విధంగా 3 రోజుల పండుగకు అంతా ముస్తయిపోయాం. ఇందుకు పల్లె, పట్నం అన్న తేడానే లేదు.అయినా కూడా మన దగ్గర బోలెడు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని నమ్మకం. నాలుగు రకాల మందులు వేసుకుంటే ఒకటో రెండో స్టెరాయిడ్స్ ఇప్పించుకుంటే చాలు.. మనకు జబ్బు వచ్చిన వెంటనే తగ్గిపోతుంది అన్న ధీమాలోనే ఉన్నాం.ఇందుకు రాష్ట్రంలో ఎవ్వరూ మినహాయింపు కాదు. అసలు గౌరవ మంత్రులు నుంచి ముఖ్యమంత్రి సహా ఎవ్వరూ మాస్క్ వేసుకోరు అన్నది నిజం. కనుక ప్రజలకు కూడా ఆ తరహా ఆందోళనలూ భయాలూ అన్నవి లేకుండా పోయాయి. ఆఖరికి కొన్ని మెడికల్ షాపుల్లో డోలో 650 కూడా దొరకనంతగా ఇప్పుడు మార్కెట్ సిట్యువేషన్ ఉంది.
కొన్ని రోజులు ఆగితే మళ్లీ లాక్డౌన్ అనడం ఖాయం. ఒమిక్రాన్ కారణంగా మరణాలు లేవు. కానీ ఒమిక్రాన్ ప్రభావం శరీరంపై తీవ్రంగా మూడు నుంచి ఆరు రోజులు ఉంటుంది.. స్వల్ప స్థాయిలో మరో నాలుగైదు రోజులు ఉంటుంది. ఇవేవీ తెలియకుండానే మనోళ్లు పాపం సంక్రాంతి సంబరాలు కానిచ్చేశారు. అదే విడ్డూరం.
కరోనా వ్యాధి ఉద్ధృతి దృష్ట్యా ఈ సంక్రాంతి పండుగ అనేక జాగ్రత్తల నడుమ చేసుకోవాల్సింది. కానీ ఎవ్వరూ ఆ విధంగా నడుచుకోలేదు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఒక్కటేంటి అన్నీ కరోనా నిబంధనలను గాలికి వదిలేశాయి. ఇక పండుగకు పల్లెలకు వచ్చిన వారంతా సంబరాల్లో ముఖ్యంగా పేకాటల్లో మునిగి తేలారు.ఇవన్నీ కరోనా వ్యాప్తికి కారణం అయినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక పండుగ తరువాత ఒమిక్రాన్ లక్షణాలున్న జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో మందుల షాపులు అన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒమిక్రాన్ లక్షణాలు ఉన్న విధంగా తెలియగానే కొందరు యాంటిజెన్ టెస్టు కోసం మందుల షాపులకు పరుగులు తీస్తున్నారు. కొందరు మందులు కొనుగోలు చేసి ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఏదేమయినప్పటికీ సంక్రాంతి తరువాత కరోనా వేగం మరింత పెరగడం ఖాయమని తేలిపోయింది.