సాగర్‌ ఉపఎన్నికలో గుబులు రేపుతున్న కోవర్టు ఆపరేషన్లు

-

సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయ్. ప్రత్యర్థులపై హాట్‌ కామెంట్స్‌ చేస్తూ ఎన్నికల్లో హీట్ పెంచుతున్నారు నేతలు. టీఆర్ఎస్,కాంగ్రెస్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎలాంటి ఛాన్స్‌ తీసుకోవడానికి సిద్ధంగా లేరు రెండు పార్టీల నేతలు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ కి ముందే చేరికలను ప్రోత్సహించింది టీఆర్ఎస్..కాంగ్రెస్ నేత జానారెడ్డితో సన్నిహిత సంబంధాలున్న ఆ నేతలే ఇప్పుడు గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్నారు.


నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల వ్యూహాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు సీఎం కేసీఆర్. సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించి ఫీల్డ్‌లోకి పంపి ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు తెప్పించుకుంటున్నారు. దుబ్బాక సిట్టింగ్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కోల్పోయిన తర్వాత వచ్చిన ఉపఎన్నిక నాగార్జునసాగర్‌. ఇది కూడా ఆ పార్టీకి సిట్టింగ్‌ స్థానమే. దీంతో ఎలాంటి ఛాన్స్‌ తీసుకోవడానికి సిద్ధం లేదు. కాంగ్రెస్‌ నుంచి బలమైన అభ్యర్థి జానారెడ్డి బరిలో ఉండటం. ఇంకోవైపు బీజేపీ కాలుదువ్వుతుండటంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టీఆర్ఎస్.

జానారెడ్డికి ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో పట్టుఉంది. ప్రతిఊరిలోనూ ఆయనకు గట్టి అనుచర గణం ఉంది. అయితే 2018 ఎన్నికల తర్వాత.. ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చాక చాలా మంది జానారెడ్డి అనుచరగణం కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిపోయింది. ఇలా కారెక్కిన వారంతా చిత్తశుద్ధితో నోముల భగత్‌ గెలుపుకోసం పనిచేస్తున్నారా లేక కోవర్టులుగా పనిచేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. అనుమానంతో పార్టీలో ఉన్నవారిని కోవర్టులుగా ముద్ర వేస్తే అది అసలుకే మోసం వస్తుంది. అందుకే పార్టీలో ఇటీవల చేరిన వారు ఎవరు..వారిలో జానారెడ్డి అనుయాయులు ఎవరు అన్నది రహస్యంగా తెలుసుకుంటున్నారట.

కోవర్టులుగా భావిస్తున్న వారు ఎవరిని కలుస్తున్నారు ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు వారి కదలికలేంటి అన్న అంశాలను తెలుసుకోవడానికి టీఆర్‌ఎస్‌ ఓ టీమ్‌ను సిద్ధం చేసింది. పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులతో కోవర్టులు జతకలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా అసంతృప్తులు, కోవర్టులు ఎవరన్నదానిపై ఒక జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ టీమ్‌లో హైదరాబాద్‌ నుంచి సూచించిన వారే సభ్యులుగా ఉన్నారట. జిల్లా, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులను పరిగణనలోకి తీసుకోలేదని టాక్‌. అయితే ఈ విషయం తెలిసిన స్థానిక నేతలు ఎన్నికలను లైట్ తీసుకోకుండా సీరియస్ గా పని చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news