కరోనా నుంచి బయటపడడానికి వ్యాక్సినేషన్ ఏకైక మార్గమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ లో కోవిన్ పోర్టల్ (Covin Portal) తో వ్యాక్సినేషన్ ప్రక్రియలో విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ రోజు కోవిన్ గ్లోబల్ సమావేశాన్ని పురస్కరించుకుని పలు దేశాలను ఉద్దేశించి మోదీ వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళి బయటపడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశాకిరణంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
గత వందేళ్ళలో కోవిడ్ లాంటి మహమ్మారిని ప్రపంచం చవిచూడలేదని, శక్తివంతమైన దేశాలు సైతం కరోనా ముందు తలవంచక తప్పలేదన్నారు. ఈ సందర్భంగా అన్ని దేశాల్లోనూ కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భారత్ తన అనుభవాలను ప్రపంచదేశాలతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉందని పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్ పై పోరులో టెక్నాలజీ కీలకపాత్ర పోషించిందని, వ్యాక్సినేషన్ కోసం డిజిటల్ విధానాన్ని అవలంభిస్తున్నామన్నారు.కోవిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌ను ఓపెన్ సోర్స్‌గా చేసి… ఇతర దేశాలకు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రధాని తెలిపారు. టెక్నాలజీలోని వనరులను వాడుకోవడానికి ఓ పరిమితి అంటూ లేదని, ఈ అంశం బాగా కలిసొచ్చిందని అన్నారు. అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్స్ చేసినట్లు చెప్పారు. భారతీయ నాగరికత యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తుంని కరోనా మహమ్మారి వేళ ఈ తత్వాన్ని అందరూ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.