తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ వేదికగా మహిళా దర్బార్ నిర్వహిస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఫిర్యాదులను తీసుకోనున్నారు గవర్నర్. అయితే దీనిపై కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సీపీఐ నారాయణ గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేఖించారు. తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని అన్నారు. గవర్నర్ మహిళా దర్బార్ ను ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సహజంగా ఎవరైనా ప్రతినిధి వర్గం కలిస్తే కలవవచ్చు..వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించవచ్చు కానీ రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్ ను వేదిక చేయరాదని అన్నారు. గవర్నర్ కు గతంలో రాజకీయ నేపథ్యం ఉందని తెలుసని.. అయితే గవర్నర్ గా తటస్థ బాధ్యతలు నిర్వహించాలి.. ఆ మేరకే ప్రవర్తించాలని అన్నారు. ఒక వైపు బీజేపీ రాజకీయ దాడి పెంచింది. మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తోందని నారాయణ అన్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ పాత్ర రాజకీయ పరంగా ఉంది. ఇది ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేఖం అని.. మహిళా దర్బార్ రద్దు చేయాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ పై విధాన పరంగా సీపీఐ పోరాడుతుందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ పబ్ వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ. మైనర్లను పబ్ కు అనుమతించడం చట్టరిత్యా నేరమని.. ఆ పబ్ ను సీజ్ చేసి యజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం ఘటనను మసిపూసి మారేడు కాయ చేస్తోంది టీఆర్ఎస్ అన్నారు.
గవర్నర్ తమిళిసై లక్ష్మణ రేఖ దాటుతున్నారు: సీపీఐ నారాయణ
-