మరోసారి ఏపీ సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న జరిగిన సీపీఐ జిల్లా సభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మద్య నిషేధానికి సరికొత్త అర్థం చెప్పిన జగన్ పక్కా బిజినెస్‌మ్యాన్ అని అన్నారు రామకృష్ణ . మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ . 2019లో మద్యం ద్వారా రాష్ట్రానికి రూ.8,914 కోట్లు వస్తే ఇప్పుడు అది రూ. 20వేల కోట్లు దాటిపోయిందన్నారు రామకృష్ణ. ఇప్పుడేమో మద్యం దుకాణాలను మళ్లీ ప్రైవేటుకు ఇస్తానని అంటున్నారని అన్నారు రామకృష్ణ.
దీనివల్ల నెలకు రూ. 3 వేల కోట్ల చొప్పున ఏడాదికి రూ. 36 వేల కోట్లు ఆదాయం రాబోతోందని లెక్కలతో సహా వివరించారు రామకృష్ణ. మద్య నిషేధం విషయంలో జగన్‌కు వేరే అర్థం ఉందని, గతంలో ఉన్న బ్రాండ్లను నిషేధించి మొత్తం తన బ్రాండ్లు తీసుకురావడమే మద్యనిషేధమని జగన్ భావిస్తున్నారని ధ్వజమెత్తారు రామకృష్ణ. మద్యనిషేధం పేరుతో సొంత బ్రాండ్లు అందిస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పులతో దివాలా తీయించారని విమర్శించారు రామకృష్ణ. 2014 నాటికి రాష్ట్రంలో రూ. 96 వేల కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడవి రూ. 8.35 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మద్యంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం జగన్ ప్యాలెస్‌కే వెళ్తోందని ఆరోపించారు రామకృష్ణ.