గడువిచ్చినా వైదొలగలేదు.. కోహ్లీపై వేటు తప్పలేదు

-

ఎంఎస్ ధోని తర్వాత టీమిండియా మూడు ఫార్మట్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి టీ20, వన్డే, టెస్టు జట్లకు సారథ్యం నిర్వహిస్తూ వచ్చాడు. టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే టీమిండియా నిష్క్రమించడంతో పొట్టి ఫార్మాట్ క్యాప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగాడు. కానీ, సెలెక్షన్ కమిటీ వన్డే క్యాప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. సమయం ఇచ్చినా నిర్ణయం తీసుకోకపోవడం వేటు వేయక తప్పలేదని తెలుస్తున్నది.

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ టీమిండియాకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేకపోయాడు. దీంతో అతని సారథ్యంపై అనుమానాలు చెలరేగాయి. మరోవైపు అవకాశం దక్కినప్పుడల్లా రోహిత్ శర్మ క్యాప్టెన్‌గా సత్తా చాటుతూ వస్తున్నాడు. ముప్పును గ్రహించిన విరాట్ కోహ్లీ టీ20 క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే, వన్డే జట్టు బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లీకి సూచించినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై రెండు రోజుల గడువు ఇచ్చింది. గౌరప్రదంగా తప్పుకోవడానికి అవకాశం కల్పించింది. కానీ, విరాట్ కోహ్లీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీని తప్పిస్తూ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటిస్తూ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ప్రకటించింది.

అయితే, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీనే క్యాప్టెన్‌గా కొనసాగనున్నారు. దక్షిణాఫ్రికాతో టెస్టు జట్టును సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. వైస్ క్యాప్టెన్ అజింక్య రహానేపై వేటు వేసింది. అతడి స్థానంలో రోహిత శర్మకు బాధ్యతలు అప్పగించింది. దీని దృష్ట్యా భవిష్యత్తులో రోహిత్ మూడు ఫార్మాట్లకు కూడా క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.

సారథిగా విరాట్ కోహ్లీ గెలుపు శాతం అధికంగానే ఉంది. క్యాప్టెన్‌గా కోహ్లీ 85 మ్యాచ్‌లు ఆడగా అందులో 65 విజయాలు, 27 ఓటమలు ఉన్నాయి. టీ20ల్లో 50 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా, 30 మ్యాచ్‌లో విజయం సాధించగా, 16 మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. విజయాల శాతం అధికంగా ఉన్నా ఐసీసీ టోర్నీల్లో టీమిండియా సత్తా చాటలేకపోతున్నది.

 

Read more RELATED
Recommended to you

Latest news