ప్ర‌ముఖ కంపెనీల పేరిట ఫేక్ వెబ్ సైట్లు ఏర్పాటు.. రూ.1 కోటికి పైగా కుచ్చు టోపీ..!

దేశంలో సైబ‌ర్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్ర‌జ‌ల‌ను అమాయ‌కుల‌ను చేసి కొంద‌రు మోస‌గాళ్లు వారి నుంచి పెద్ద ఎత్తున డ‌బ్బుల‌ను కొట్టేస్తున్నారు. కొంద‌రు కేటుగాళ్లు ఏకంగా ప్ర‌ముఖ కంపెనీల‌కు చెందిన ఫేక్ వెబ్‌సైట్ల‌ను ఏర్పాటు చేసి వాటి స‌హాయంతో ప‌లువురికి రూ.1 కోటికి పైగా కుచ్చు టోపీ పెట్టారు. చివ‌ర‌కు పోలీసుల‌కు చిక్కారు. వివ‌రాల్లోకి వెళితే..

Fakewebsites
Fakewebsites

ఢిల్లీకి చెందిన వికాస్ మిస్త్రీ (24), విన‌య్ విక్ర‌మ్ సింగ్ (37)ల‌తోపాటు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ప్ర‌ముఖ కంపెనీలైన హ‌ల్దీరామ్‌, ప‌తంజ‌లి, అమూల్ ల పేరిట ఫేక్ వెబ్‌సైట్ల‌ను ఏర్పాటు చేశారు. చూసేందుకు అవి అచ్చం అస‌లు కంపెనీల్లాగే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఆ వెబ్‌సైట్ల‌కు గాను గూగుల్ యాడ్స్ లో యాడ్స్ కూడా ఇచ్చారు.

త‌మ కంపెనీల్లో కొంత రుసుము చెల్లిస్తే ఫ్రాంచైజీల‌ను అందిస్తున్నామ‌ని చెబుతూ యాడ్స్ పెట్టారు. దీంతో అవి నిజ‌మే అని న‌మ్మిన కొంద‌రు వారికి ఫ్రాంచైజీల కోసం డ‌బ్బులు చెల్లించారు. అలా బాధితుల నుంచి వారు రూ.1.10 కోట్ల‌ను వ‌సూలు చేశారు.

అయితే ఇటీవ‌ల ఢిల్లీకి చెందిన ఓ మ‌హిళ కూడా వీరి ఉచ్చులో ప‌డింది. హ‌ల్దీరామ్‌కు చెందిన ఫ్రాంచైజీ ఇస్తామంటూ ఆ కంపెనీ ఫేక్ సైట్‌తో ఆమెకు వారు కుచ్చు టోపీ పెట్టారు. ఆమె ముందుగా అన్ని ప‌త్రాల‌ను నింపి వారికి రెండు నెల‌ల్లో రూ.11.74 ల‌క్ష‌ల‌ను చెల్లించింది. త‌రువాత వారు ఇంకో రూ.1.60 ల‌క్ష‌ల‌ను చెల్లించాల‌ని అడిగారు. అయితే ఆమెకు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఈ క్ర‌మంలో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లు వారి వ్య‌వ‌హారం మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రముఖ కంపెనీల పేరిట ఫేక్ వెబ్‌సైట్ల‌ను ఏర్పాటు చేసి వారు ఫ్రాంచైజీల‌ను ఇస్తామ‌ని చెప్పి అనేక మంది నుంచి ఇలాగే ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేశార‌ని వెల్ల‌డైంది. ఈ క్ర‌మంలో వారు మొత్తం రూ.1.10 కోట్ల‌ను బాధితుల నుంచి వ‌సూలు చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులు డ‌బ్బుల‌ను డిపాజిట్ చేసేందుకు ప‌లు వేర్వేరు బ్యాంక్ అకౌంట్ల‌ను ఉప‌యోగించారు. అయితే బాధితుల‌తో మాట్లాడేందుకు వారు బోగ‌స్ సిమ్ కార్డుల‌ను వాడారు. ఈ క్ర‌మంలోనే మొత్తం న‌లుగురు నిందితుల‌ను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. ఆన్‌లైన్‌లో ఇలా ఎవ‌రైనా ఏదైనా కంపెనీకి చెందిన ఫ్రాంచైజీని ఇస్తామ‌ని అడిగితే న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఆ కంపెనీకి చెందిన అధికారిక కార్యాల‌యం లేదా ఏజెన్సీకి వెళ్లి ముందుగా నిజాల‌ను నిర్దారించుకోవాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.