రేణిగుంట ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. చిన్నారులు సహా ముగ్గురు మృతి

ఏపీలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా రేణిగుంట లోని భగత్ సింగ్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్తిక చిన్నపిల్లల ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారి మంటలు మొత్తం వ్యాపించడంతో ఆసుపత్రి పైనే ఉంటున్న వైద్యుడు కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్ రెడ్డి మంటల్లోనే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మంటలకు తోడు పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో ఇంట్లో ఉన్నవారు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, అతి కష్టం మీద ఇంట్లోకి చేరుకొని వైద్యుడు రవిశంకర్ రెడ్డి భార్య, అత్తతో పాటు ఇద్దరు పిల్లలను మంటల్లో నుంచి బయటకు తీసుకొచ్చింది.

దట్టంగా అలుముకున్న పొగతో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులు కార్తీక, భరత్ పరిస్థితి విషమంగా ఉండటంతో, తిరుపతిలో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఇద్దరు మృతి చెందారు. మరో గదిలో నిద్రిస్తున్న వైద్యుడు రవిశంకర్ రెడ్డి చుట్టూ మంటలు దట్టంగా అలుముకోవడంతో ఆయన సజీవ దహనం అయ్యారు. ఆయనను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.