మొన్న బుధవారం కురిసిన వర్షానికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట.. విక్రయించి.. డబ్బు చేతికేస్తుంది అనుకున్న రైతుకు.. నీటి పాలైన ధాన్యాన్ని చూసి కన్నీరు పట్టుకున్నాడు. అకాల వర్షంతో కష్టపడి పండించిన పంట.. నీటి పాలైంది. అంతేకాకుండా.. మామిడి కాయలు నేల రాలాయి. నిమ్మకాయ చెట్లు నేలకొరిగాయి. అకాల వర్షం సృష్టించిన బీభత్సానికి రైతులు విల విలలాడారు.
అయితే ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని, ఇది స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఈ నెల 7వ తేదీ సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమవుతుందని, ఆపై ఇంకా బలపడి 8వ తేదీ సాయంత్రానికి తుపానుగా మారి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ వివరించింది.