పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా విభిన్న ప్రకటనలు చేసింది. 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లుగా ప్రకటించింది. అయితే.. పోలవరం ప్రాజెక్టు పురోగతి నివేదికను కేంద్రం ప్రభుత్వం నేడు పార్లమెంటు ముందుంచింది. 2017-18 ధరల మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లు అని కేంద్రం వెల్లడించింది. 2019లో తమ వద్దకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు అని తెలిపింది. ప్రతిపాదిత అంచనాలను కేంద్ర జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ అంగీకరించిందని కేంద్రం వివరించింది.
ఆర్సీసీ అధ్యయనంలో అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా నిర్ధారణ అయిందని పేర్కొంది. 2013-14 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ.29,027 కోట్లు అని కేంద్రం వెల్లడించింది. భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చుల వల్లే అంచనా వ్యయం పెరిగిందని వివరించింది. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇప్పటివరకు రూ.13,463 కోట్లు ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది.
పోలవరం సవరించిన అంచనాలపై రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ
సమాధానమిచ్చింది. తొలి దశలో పోలవరంలో 41.15 మీటర్ల వద్ద నీరు నిల్వ చేయడం జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. సవరించిన అంచనాలపై ఒకే కమిటీ రెండు సిఫారసులు చేసిందని వివరించింది. సవరించిన అంచనాలను కేంద్రం చెల్లిస్తుందా? అని కనకమేడల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పోలవరం ప్రాజెక్టు నివేదికను సభ ముందుంచింది.