నిన్న టీడీపీ ఎన్నారై ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రన్న కానుక కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. గుంటూరు ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం చేపట్టారని వెల్లడించారు. ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారని నవంబరు 20న జగనన్న సైన్యం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిందని, నిన్నటి ఘటనకు ఆ పోస్టుకు సంబంధం ఉందని దేవినేని ఉమ ఆరోపించారు.
ముందుగానే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం వైసీపీ నేతలు క్యూలు కట్టి నోళ్లు పారేసుకున్నారని మండిపడ్డారు. జగనన్న సైన్యం, అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారని నవంబర్ 20న ప్రచారం చేశారన్నారు. ‘గజగజ వణకాల్సిందే ఒక్కొక్కడు … స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి’ అని పోస్టు పెట్టారన్నారు. నిన్న జరిగిన ఘటనకు.. ఈ పోస్టుకు సంబంధం ఉందన్నారు దేవినేని.