తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హై కోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని.. రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని డీహెచ్ ప్రకటన చేశారు. పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరమని.. గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతం లేదని కోర్టు కు వివరించారు.
మెదక్ లో అత్యధికంగా 6.45, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం పాజిటివిటీ ఉందని.. జీహెచ్ ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ ఉందని డీహెచ్ తెలిపారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతం గా ఉందని.. ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించామని వెల్లడించారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు చేసామని.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని స్పష్టం చేశారు. మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని డీహెచ్ వెల్లడించారు.