గత కొద్ది రోజులుగా అదిగో కొత్త పార్టీ, ఇదిగో కొత్త పార్టీ అంటూ ఊరిస్తూ ఊరిస్తూ వస్తున్న పీకే త్వరలో పార్టీ ఏదీ ఉండబోదని తేల్చేశారు. పార్టీ లేదు కానీ పీకే నేతృత్వం మాత్రం ఎక్కడికీ పోదు. ఆయన త్వరలో తన వ్యూహం మార్చి పాదయాత్ర చేయనున్నారు. కేసీఆర్ కు ఇచ్చిన మాట ప్రకారమే తాను పార్టీ పెట్టబోనని సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నారని సమాచారం. అంటే వచ్చే ఎన్నికల్లో తన స్నేహితుడి కోసం పని చేస్తానని, ఇందులో సందేహాలకు తావేలేదన్నారు.
అబ్బా! ఎందుకు ఈ నడక అని ఎవ్వరూ ఎవ్వరినీ ప్రశ్నించక్కర్లేదు కానీ రాజకీయాల్లో పాదయాత్ర అంటే ఓ పెద్ద హిట్ ఫార్ములా గా మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉమ్మడి రాష్ట్రంలో నడిచారు. ఆ తరువాత అనూహ్య రీతిలో అధికారం కైవసం చేసుకుని, ఆనాటి దిగ్గజ నేత చంద్రబాబును డైలమాలో పడేశారు.ఆయన ఆ రోజు నడిచిన తీరు, ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్న విధానం ఇవన్నీ ఇప్పటికీ స్మరణీయాలే వైఎస్సార్ అభిమానులకు..!
ఆ స్థాయిలో ఆయన కుమార్తె షర్మిల నడిచారు. కుమారుడు జగన్ నడిచి సీఎం అయి, తండ్రి సెంటిమెంట్ ను నిరూపించారు. ఇప్పుడు మళ్లీ పాదయాత్రల కాలం వచ్చేసింది. ఆల్రెడీ తెలంగాణలో బండి సంజయ్, షర్మిల వంటి నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. అవి ఎలా ఉన్నా కూడా నిరంతరాయంగా సాగేందుకు ఆయా నేతలు ప్రణాళికలు అమలు చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయాలనకుని వెనక్కు తగ్గారు. అందుకు అధిష్టానం అనుమతి కూడా లేదు. దీంతో రేవంత్ వ్యూహం పూర్తిగా మారిపోయింది. అధిష్టానం అనుమతి ఇస్తే వచ్చే ఎన్నికలకు ముందే 119 రోజుల పాటు 119 నియోజకవర్గాలనూ చుట్టి వస్తానని అంటున్నారు.
ఇక మరో కీలక వ్యక్తి, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. జన సురాజ్ పేరుతో ఆయన పాదయాత్ర చేయనున్నారు. బీహార్ నుంచి ఆయన ప్రయాణం మొదలు కానుంది. రాష్ట్రం అంతా పర్యటించి మూడు వేల కిలోమీటర్ల మేరకు నడక సాగించి ప్రభుత్వ విధానాల అమలు, ప్రజా సమస్యలు తెలుసుకుంటానని, ఇప్పట్లో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని తేల్చేశారు.