ఆ దేశాధ్యక్షుడు పలాయనం చిత్తగించడు.. పోరాటం వదలడు.. అది కదా కావాలి..ఇదే తన స్ఫూర్తి ఉక్రెయిన్ ప్రధాని ఇవాళ జాతి జనులకు ఇస్తున్న కడ వరకూ ఇవ్వాలనుకుంటున్న స్ఫూర్తి కనుక యుద్ధం ఎందుకు అన్న ప్రశ్న నుంచి యుద్ధం ముగిసే వరకూ.. చేయాల్సిన పనులు వరకూ మనకు గుర్తుకు వస్తున్నవి ఎన్నో! మధ్యలో వదిలేసిన ప్రయాణం లాంటిది యుద్ధం కాకూడదు మరి! యుద్ధం అంటే ఉరకలెత్తే ఉత్సాహం ఎంతటి ఉత్పాతంలో అయినా ఉండాల్సిందే అన్నది ఉక్రెయిన్ ఇస్తున్న సందేశం. నైతికమా అంటే అమెరికా కపట రీతి ప్రకారం చూస్తే ఆ తోవలో ఇది అనైతికమే..
ఆ మాటకు వస్తే రష్యా ది కూడా అనైతిక పోరు మాత్రమే! అయినా కూడా తప్పక చేయాల్సిన యుద్ధంలో చావే కీలకం..శవాల దిబ్బలు దాటుకుని వస్తే రష్యా కు ఆనందం ఎందుకని? ఏమో! ఆ దేశం కోరుకుంటున్నది తమ అంతర్గత భద్రతకు ప్రమాదకారి ఉక్రెయిన్ అని..వేర్పాటు వాద ప్రాంతాలకు స్వతంత్రం ప్రకటించి ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలనుకుంటున్నదీ ఇందుకే అని అంటోంది రష్యా..! ఆ దిశగా మృత్యు హోరు వినిపించాక రష్యా పశ్చాత్తాప ప్రకటన ఒకటి అత్యంత నాటకీయ ధోరణిలో వినిపిస్తుందేమో!
పారిపోవడానికి సాయం వద్దు అని చెప్పాడు అమెరికాను ఉద్దేశించి ఉక్రెయిన్ ప్రధాని జెలెన్ స్కీ .. కానీ అమెరికా మాత్రం ఆయనను సురక్షితం అయిన చోటుకు తరలిస్తామని అంటోంది. అమెరికా నాటకం ఆధారంగా నడుస్తున్న యుద్ధంలో ముఖ్యంగారష్యా చేస్తున్న రాకెట్ దాడుల్లో అన్నింటినీ కోల్పోయి ఒంటరిగా ఉన్నా కూడా ఉక్రెయిన్ నిబ్బరాన్ని కోల్పోకూడదు అని నిర్థారించుకుని ఆ మేరకు తన పంథాను నిర్ణయించింది.యుద్ధంలో ఓడిపోయినా చావు అంతిమం అయినా కూడా పోరాడాలని ఉక్రెయిన్ ప్రధాని చెప్పిన మాటలు ఆ దేశ పౌరులను ఎలా ఉత్తేజ పరుస్తున్నాయో కానీ అవి వింటే వారి పోరాట స్ఫూర్తికి మాత్రం జేజేలు పలకడం మాత్రం మానుకోలేం.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంబంధిత ఉత్పాతం తీవ్రతరం అవుతోంది. రాజధాని కీవ్ ను తమ పరం చేసుకునేందుకు రష్యా బలగాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం తనదైన పంతంతోనే యుద్ధం కొనసాగిస్తున్నారు. తాము రాజధానిని వదులుకునేదే లేదని తేల్చి చెబుతున్నారు.కడదాకా పోరాడతామని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో యుద్ధం ఎందుకు…
ప్రపంచం అంతా ఓ వైపు ఉక్రెయిన్ ఓ వైపు ఉండిపోయింది.రష్యా విచక్షణా రహితంగా ఆ దేశం సైనికుల పై కాల్పులు జరుపుతోంది. యుద్ధం అస్సలు అనివార్యం కానివ్వకుండా చేసేందుకు ఏ రోజూ ఏ ప్రయత్నాన్నీ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు కొందరు స్వదేశాలకు వచ్చేందుకు నానా పాట్లూ పడుతున్నారు. ఇవన్నీ ఓ విధంగా కొలిక్కి వచ్చేలోగానే యుద్ధం పూర్తయినా పూర్తయిపోతుంది. మనకు నివారించలేనంత రక్తపాతం కళ్లెదుటే నిలిచి ఉంటుంది.అయినా కూడా ఎక్కడా ఎవ్వరూ తగ్గడం లేదు.
ముఖ్యంగా అమెరికా నాటకంలో ఉక్రెయిన్ బలి పశువుగా మారిపోయింది అన్న వాదన స్థిరం అయిపోయింది. నాటోలో సభ్యత్వం కోరి తరువాత కొన్ని సందర్భాల్లో నాటో బలగాలకు ఆశ్రయం ఇచ్చి ఉక్రెయిన్ తప్పు చేసింది అన్నది రష్యా వాదన. అలా కాకుండా ఉంటే తాము ఆక్రమణలకు తావిచ్చే వారం కాదు అన్నది కూడా ఆ దేశ వాదన. కానీ పుతిన్ మాటలు ఎలా ఉన్నా రక్తపాతాన్ని ప్రోత్సహించే రాజకీయాలను ఏ దేశం కూడా సమర్థించకూడదు. అమెరికా ఆటలో రష్యా ప్రతీకారంలో బలి అయిపోయిన చిన్న దేశం ఉక్రెయిన్ మాత్రమే! పౌరుల ప్రయోజనాలు కన్నా దేశం ప్రయోజనాలు కన్నా వ్యక్తిగత పంతాలే సంబంధిత వివాదాలకు ఆజ్యం పోశాయి అన్నది కూడా సుస్పష్టం.దీంతో కొద్ది రోజుల్లో రష్యా తన మాట నెగ్గించుకుని శవాల దిబ్బతో ఉన్న ఉక్రెయిన్ ను సొంతం చేసుకోవడం ఖాయం.కానీ ఈ యుద్ధం తరువాత వచ్చే ఆర్థిక ఆంక్షలను పుతిన్ ఎలా ఎదుర్కోగలరు?
– డైలాగ్ ఆఫ్ ద డే – మనలోకం ప్రత్యేకం