బ్రేకప్ తర్వాత కలిశారా..అయితే ఇవి మాట్లాడొద్దు..!

-

ప్రేమలో పడటం ఎంత బాగుంటుందో..ఒకవేళ ఆ ప్రేమలో బ్రేకప్ అయితే..ఆ జ్ఞాపకాల నుంచి బయటపడటం అంతకుమించి నరకంగా ఉంటుంది. ఇలా సాగుతున్న వారి జీవితంలోకి మళ్లీ ప్రేమించిన వారు ఏదో ఒక సందర్భంలో వస్తారు. అయితే..అలాంటి సందర్భంలో వారితో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ఒకసారి వదిలేసి వెళ్లిన వారి గురించి ఎందుకు ఆలోచించాలి అనుకుంటున్నారేమో..కొన్నిసార్లు చిన్నచిన్న కారణాలకే..అపార్థం చేసుకుని విడిపోతూ ఉంటారు. అలాంటి వారికి మరొక అవకాశంవస్తే కలిస్తే తప్పేం లేదు కదా..మళ్లీ మాజీని కలిసే సందర్భాలు వస్తే.. కొన్ని విషయాలు వారితో మాట్లాడకూడదంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందామా..!

గతాన్ని తవ్వద్దు..

బ్రేకప్‌ అయిన వ్యక్తి తారసపడితే కొంతమంది వారిపై ఉన్న కోపాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల తాత్కాలిక ఆనందం లభించినా తర్వాత మరోసారి చింతించాల్సి రావచ్చు. మీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలపై మీకు స్పష్టమైన అవగాహన ఉండే ఉంటుంది. కాబట్టి, మరోసారి తిరిగి గతాన్ని తవ్వుకుని మూడ్‌ని చెడగొట్టుకోవద్దు.

సాగదీయొద్దు..

బంధం విడిపోవటానికి కరణాలు చాలా ఉంటాయి. అయితే దాని తాలూకు జ్ఞాపకాలు కొంతమందిని వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తమ మాజీపై మరికొన్ని ప్రశ్నలు మదిలో నిండిపోతాయి. అయితే అనుకోకుండా వారు కలిసినప్పుడు కొంతమంది ఆ ప్రశ్నలను అడుగుతూ.. మరోసారి చర్చలు పెడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు క్లుప్తంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడండి. అంతేకానీ, పాత విషయాలను ముందుపెట్టి సాగదీయటం వల్ల ఒరిగేదేమి ఉండదంటున్నారు నిపుణులు.

ఎత్తిపొడుపులు వద్దు..

చాలా సందర్భాల్లో రిలేషిన్‌షిప్‌ బ్రేకప్‌ కావడానికి అభిప్రాయభేదాలే కారణాలు అవుతాయి. అయితే బ్రేకప్‌ అయిన వ్యక్తి తారసపడినప్పుడు కొంతమంది వారిని నేరుగా విమర్శించకుండా నలుగురిలో ఎత్తిపొడుపు మాటలతో ఇబ్బంది పెట్టాలని చాలామంది చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో తోటివారికి ఆ విషయాలు సరిగా అర్థంకాకపోయినా మీ మాజీని మాత్రం బాగా నొప్పిస్తుంటాయి. దీనివల్ల మీపై ద్వేషం పెరుగుతుంది తప్ప మీకు ఎటువంటి లాభం జరగదు.

జ్ఞాపకాలను గుర్తు చేయద్దు..

ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. చాలామంది బ్రేకప్‌ తర్వాత వాటిని చెరిపేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి, ఆ వ్యక్తి మళ్లీ మీకు ఎదురుపడినప్పుడు వాటిని గుర్తు చేయకూడదంటున్నారు నిపుణులు. దీనివల్ల మీరు వారిని మళ్లీ ఇష్టపడుతున్నారనే భావన వారిలో కలిగే అవకాశం ఉంటుంది. ఇది మరోసారి గొడవలకు దారితీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి, పాత జ్ఞాపకాలను గుర్తు చేయకపోవడమే మంచిది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version