విశాఖ కేంద్రంగా అసని తుఫాను ఎలా ఉన్నా పొలిటికల్ తుఫాను మాత్రం వేరుగా ఉంటుంది. ఆ విధంగా కడప రెడ్డికి, నెల్లూరు రెడ్డికి ఎంతో తేడా..! అదేవిధంగానో చూద్దాం. ఈ కథంతా 2014 నుంచి 2022 వరకూ జరిగి, 2024 వరకూ కొనసాగుతుంది. అంటే ఓ పదేళ్ల కథ ఇది.. విస్తృత రూపంలో చెప్పాలి.. చదవండిక !
ఆ రోజు విజయమ్మ ఇక్కడి నుంచే అనగా విశాఖ పార్లమెంట్ స్థానం నుంచే పోటీచేశారు. కానీ అనూహ్య రీతిలో ఓడిపోయారు. ఆమె చేసిన తప్పు ఏమీలేదు. బైబిల్ పట్టుకుని ఆమె ప్రచారం చేస్తున్నారు.. ఇలా అయితే మత మార్పిడులు జరిగే అవకాశం ఉంది అని ఆ రోజు విపక్ష పార్టీ టీడీపీ గగ్గోలు పెడుతూ ఓ అసత్య ప్రచారం మొదలు పెట్టింది. అంతేకాకుండా విశాఖ కేంద్రంగా నివసించే నార్త్ ఇండియన్స్ లో ఎక్కువ మందిపై ఈ ప్రచారం ప్రభావం చూపేందుకు ఆస్కారం ఇచ్చింది.
దీంతో పాటు విశాఖలో ఒక వేళ విజయమ్మ గెలిస్తే కడప రౌడీలు హల్చల్ చేస్తారు తరువాత కాలంలో అంటూ మరో చెడ్డ ప్రచారానికి తెర తీశారు. వీటిలో వాస్తవాలు ఎలా ఉన్నా కూడా ఆ రోజు విజయమ్మ ఘోరంగా ఓడిపోయారు. జగన్ పరివారంలో ఉన్న ముఖ్యనేతలంతా విశాఖ లో మోహరించినప్పటికీ అప్పటి ఆమె పరాజయాన్ని ఆపలేకపోయారు. ట్రైమ్యాక్స్ ప్రసాద్ అప్పటికే ఉత్తరాంధ్రలో భారీగా పెట్టుబడులు పెట్టి దండీగా లాభాలు రాబట్టుకున్నారు.ఆయన ఆ రోజు అంటే 2014లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ఆ విధంగా అటు విశాఖలోనూ ఇటు విజయవాడలోనూ వైసీపీ ఘోర పరాజయాలు చవి చూసి, ఖంగుతింది.ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఆ పార్టీకి అది చావు దెబ్బే ! అదృష్టం బాగుండి.. అదేవిధంగా ఆ రోజు టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న కారణంగా కంభంపాటి హరిబాబు అనే కమ్మ నేత అనూహ్యంగా గెలిచి నిలిచారు. అలానే విజయవాడలో కేశినేని నాని తన హవా కొనసాగించి విజయ దుందుభి మోగించారు. కాలం గొప్పది కదా ! ఆ రోజు ఉన్న పరిణామాలు ఇవాళ లేవు. వైసీపీ బలపడడంతో విశాఖ ఎంపీగా మొన్నటి ఎన్నికల్లో (2019 ఎన్నికల్లో) ఎంవీవీ సత్యనారాయణ అనే బిల్డర్ గెలిచి, వైసీపీ పరువు నిలబెట్టారు. ఇది కూడా జగన్ హవాలో వరించిన గెలుపే కావడం ఇక్కడ ప్రస్తావనార్హం.
పేరుకు ఎంపీ ఆయనే అయినప్పటికీ పెత్తనం అంతా రేపో మాపో రాజ్య సభ సభ్యుడిగా రిటైర్ కానున్న సాయిరెడ్డిదే ! అయితే ఆ రోజు పోటీచేసిన విజయమ్మ కూ ఇప్పుడు ఇక్కడ రాజకీయం నడుపుతున్న నెల్లూరు రెడ్డి ఆడిటర్ సాయిరెడ్డికీ ఎంతో తేడా ఉంది. మరి! ఇవాళ విశాఖ కేంద్రంగా రౌడీయిజం లేదా అంటే నెల్లూరు రెడ్లు తమ హవా కొనసాగించడం లేదా అంటే ఔననే అంటున్నది టీడీపీ.మరి! టీడీపీ చేస్తున్న ఫైట్ ఏంటి? ఇది కూడా ఆలోచించుకుని తీరాలి. కనుక కడప రెడ్డికీ, నెల్లూరు రెడ్డికీ ఎంతో తేడా ?అయినా విశాఖలో నెల్లూరోళ్ల మాట సుబ్బిరామి రెడ్డి నాటి కాలం నుంచి ఇప్పటి సాయి రెడ్డి హయాం వరకూ చెల్లుతూనే ఉంది.ఇది కదా ! విశేషం ! ఇది కదా రాజకీయం ! ఇది కదా విడ్డూరం ! అరే బాబూ ! జర శోచోరే !