హైదరాబాద్‌లోని కుల్సుంపురలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని వీధి కుక్కులు పీక్కుతిన్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన బాలుడిని సోఫియన్ గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మరోవైపు బాలుడిని ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
మృతదేహం లభ్యమైన ప్రదేశానికి కాస్త దూరంలో మూసీనది పారుతూ ఉండడంతో కుక్కలు మృతదేహాన్ని అక్కడినుంచి లాక్కొచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు పోలుసులు. సోఫియన్ తండ్రి సయ్యద్ కార్వాన్ లో సబ్జీమండీలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. అక్కడినుంచి బాలుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోఫియన్ తండ్రి సయ్యద్ ను పోలీసులు విచారిస్తున్నారు. సోఫియన్ తలకు గాయం అయ్యింది. అయితే అది తలపై కొట్టి చంపడం వల్ల అయ్యిందా.. చంపి మూసీలో పడేసిన సమయంలో అయ్యిందా.. వీధికుక్కలు పీక్కుతినే సమయంలో అయ్యిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం కార్వాన్ నుంచి జియాగూడా వరకు.. సబ్జిమండీ నుంచి కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించనున్నారు.