బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రతీ ఒక్కరూ బరువు తగ్గడానికి ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్నారు, ఈ క్రమంలో తొందరగా బరువు తగ్గాలని అనవసరమైన వాటిని వాడుతూ, ఆ తర్వాత ఇబ్బందులని కొని తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
కాఫీతో రోజు మొదలెట్టవద్దు.
పొద్దున లేవగానే అరగంట లోపు గోరువెచ్చని నీళ్ళు తాగడం మంచిది. కాఫీ తాగడం వల్ల మెదడులో కార్టిసాల్ విడుదల అవుతుంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఆ రోజంతా ఒత్తిడిగానే ఉంటుంది.
ఎక్కువ సేపు కూర్చోవద్దు
ప్రతీ అరగంటకి ఒకసారి కూర్చున చోట నుండి లేచి అటు ఇటూ నడవండి. శరీరాన్ని వెనక్కి వంచుతూ నడుము మీద భారం పడకుండా చూసుకోండి. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలో కదలిక ఏర్పడక కొవ్వు పెరిగే అవకాశం ఉంది.
ఫోన్ చూస్తూ అన్నం తినకూడదు
ఈ విషయంలో చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ అన్నం తినడం వల్ల మనం ఎంత తింటున్నామనేది తెలియకుండా పోతుంది. మన శరీరం ఇచ్చే సిగ్నల్ మనకి అందదు. దానివల్ల ఎక్కువ తింటాం. అందుకే బరువు తగ్గాలనుకునేవారు భోజనం చేసేటపుడు ఫోన్లని పక్కన పెట్టాలి.
ఆల్రెడీ తయారు చేసిన ఉంచిన ఆహారాలని తీసుకోవద్దు.
పొద్దున్న లేవగానే ఉప్మా, పోహా లాంటి వాటిని ఆహారంగా తీసుకోండి. నిల్వ చేసిన ఆహారాలని తినడం వల్ల బరువు పెరగడానికి ఆస్కారం ఉంది.