హైదరాబాద్ మహానగర వాసులకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రత్యేక రూట్‌ను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఈ సమాచారాన్ని హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ బుధవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. రూ.12.96 కోట్లతో గతంలోనే ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు కొన్ని రూట్లు ఎంపిక చేశారు. ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్‌తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ జిల్లా ప్రాంతాల్లో నడపనున్నారు. ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్ బండ్‌కు చేరుకుంటాయి.
ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ప్రయాణం ఉచితమే. కొన్ని రోజుల పాటు టిక్కెట్ అవసరం లేదు. అనంతరం కనీస ఛార్జీ విధించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.