హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడికి దేశవ్యాప్తంగానే ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో గతానికి భిన్నంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ కన్వీనర్ సందీప్, ఉపాధ్యక్షుడు మహేష్‌యాదవ్ తదితరులు మాట్లడుతూ.. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు.
విగ్రహం 50 అడుగుల ఎత్తు ఉండనుందని, ఈ నెల 24న హైకోర్టులో వినాయక విగ్రహాల తయారీపై వాదనలు ఉన్నాయని, ఆ రోజు వచ్చే తీర్పును బట్టి స్పష్టత వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో విగ్రహ ఏర్పాటుపై సెంట్రల్ జోన్ డీసీపీ సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు కమిటీ ప్రకటించి, ఆ సమావేశంలో మట్టి విగ్రహం ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పడంతో పోలీసుల ఒత్తిడి ఉండొచ్చని ప్రచారం జరిగింది. ఉత్సవ కమిటీ మాత్రం.. తమపై ఎవరి ఒత్తిడి లేదని, పోలీసులు పిలిచి కర్రపూజ, ఉత్సవాల నిర్వహణపై మాట్లారని తెలిపింది.మరోవైపు.. హిందూ పండుగలను దెబ్బతీయాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భగవంతురావు అగ్రహం వ్యక్తం చేశారు.