ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొందేందుకు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. అయితే తొలుత ఓటు హక్కు రావాలంటే 21 ఏళ్లుగా ఉండేది. కానీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని 18 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. అయితే ఈ నిబంధనలో తాజాగా స్వల్ప మార్పు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ). ఇకపై 17 సంవత్సరాలు దాటిన వారు కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చు. కానీ ఇది అడ్వాన్స్ మాత్రమే.
17 ఏళ్లకే ఓటరుగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ.. ఓటు హక్కు మాత్రం 18 ఏళ్లకే వస్తుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషన్ అనుప్ చంద్ర పాండే నేతృత్వంలోని ఈసీఐ అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓ, ఓఈఆర్ఓ లకు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, తేదీల్లో ఓటర్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ కొత్త దరఖాస్తు ఫారాలు 2022 ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి.