రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు భారత్ పై తీవ్రంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్ కు ఉక్రెయిన్ నుంచే ఎక్కువగా సన్ ఫ్లవర్ దిగుమతి అవుతోంది. దీంతో అక్కడ నుంచి వచ్చే సప్లై తగ్గిపోయింది. లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధర నెల రోజుల్లో రూ. 100కు పెరిగింది. గత నెలలో రూ.120-130 గా ఉన్న ధరలు ప్రస్తుతం రూ. 225 వరకు చేరకున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సాకును ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. కొంత మంది వ్యాపారులు పాత ధరలపై స్టిక్కర్లు అంటించి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఒక్కో లీటర్ నూనె ప్యాకెట్ పై రూ. 20 వరకు దోచుకుంటున్నారు. ఇదిలా ఉంటే దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరలపై ప్రతీరోజు సమీక్షించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా నిల్వచేసే వారిపై కేసులు నమోదు చేసి.. స్టాక్ మొత్తం స్వాధీనం చేసుకోనుంది.