ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసి వచ్చింది. మద్దతు ధరకు మించి మిర్చికి ధర పలుకుతోంది. దీంతో పాటు పత్తికి కూడా మంచి ధర పలుకుతుండటంతో అన్నదాతల మోహంలో ఆనందం కనిపిస్తోంది. తాజాగా ఈరోజు వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర పలికింది. గత రికార్డులను తిరగరాస్తూ… ఆల్ టైం రికార్డ్ ధర పలికింది.
ఎండు మిర్చికి రైతులకు కాసుల పంట పండించింది. దేశీ రకం మిర్చికి ఈ రోజు వరంగల్ ఎనమాముల మార్కెట్ లో క్వింటాల్ మిర్చికి రూ. 44,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి రైతు నాగేశ్వర్ రావు తీసుకువచ్చిన దేశీరకం మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్ రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం మిర్చి క్వింటాల్ రూ.37 వేలు పలికింది.
మరోవైపు పత్తికి కూడా రికార్డ్ ధర పలుకుతోంది. ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ లో క్వింటాల్ పత్తి ధర రూ. 10,500 పలికింది. ఈసారి అంతర్జాతీయ మార్కెట్ లో పత్తికి మంచి డిమాండ్ ఉండటంతో మంచి ధర వస్తోంది.