రాజకీయాల్లో ఎవరిని వారే ప్రమోట్ చేసుకోవాలి. మరొకరు ప్రమోట్ చేస్తారు అని అనుకోవడం జరగని పని. ఆ విధంగా చాలా మంది డిజిటల్ మీడియాను బాగా వాడుకున్నారు. పది మజ్జిగ ప్యాకెట్లు పంచి బిల్డప్పు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు ఉన్నారు. ఆ విధంగా కరోనా సమయంలో తామెంతో సాయం చేశామని చెప్పుకున్నారు. వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు అసెంబ్లీలో ఎన్నో భజన వాక్యాలు చదివారు. వాస్తవానికి అవి పనిచేశాయా అంటే చెప్పలేం.
మరి! పదవుల విషయంలో ఏంటి ప్రామాణికం. రోజా ఎప్పటి నుంచో కోరుకుంటున్న పదవి రానే వచ్చింది. పెద్ది రెడ్డి మనిషిగా పేరున్న నారాయణ స్వామి కూడా పదవి పొందాడు. అంటే ఒకే జిల్లా (ఉమ్మడి చిత్తూరు జిల్లా) నుంచి మూడు పదవులు కేటాయించడం ఎంతవరకూ సబబు అన్నది ప్రశ్న. అయినా రోజాకు స్థానికంగా ఉన్న వ్యతిరేకత పోతుందని అనుకోలేం. మంత్రి పదవులు తీసుకున్నంత సులువు కాదు ఇప్పుడు ఎందుకంటే ముందు ఉన్నది ఎన్నికల కాలం. బాగా పనిచేయకుండా ఉంటే ప్రజలే తప్పిస్తారు అని కూడా జగన్ చెప్పారు.
ఇక వీరవిధేయులు అయిన చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, కోటం రెడ్డి ఈ ముగ్గురూ ఇప్పుడు కీలకం గా ఉన్నారు. ఆ రోజు పాదయాత్ర విషయమై ఎంతో సాయం చేసిన వారు ఈ ముగ్గురే ! కానీ పదవులన్నీ రెడ్లకే అన్న అపవాదు వస్తుందన్న భయంతో జగన్ ఈ సారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురికే ఛాన్స్ ఇచ్చారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి, రోజా రెడ్డి కి మాత్రమే పదవులు దక్కాయి.
ఆఖరి నిమిషం వరకూ పోరాడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కోటం రెడ్డి కన్నీటి పర్యంతం అవుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అనుచరులు ఇప్పటికే నిరసనలకు దిగారు. మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ పార్టీలోనే ఉంటానని అంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా మంత్రి పదవులు అలంకార ప్రాయమే ! అధికారం అన్నది జగన్ దగ్గర మాత్రమే ఉంటుంది. గతంలో కూడా ఇదే నిరూపణ అయింది. సీఎం చెప్పనిదే సీఎంఓలో చీమ కూడా కదలదు. కనుక పదవులు రాలేదన్న దిగులు నాయకులకు అస్సలు వద్దే వద్దు.