ఎడిట్ నోట్ : వైజాగ్ స్టీల్ ఉద్య‌మంలోకి రాజ‌మౌళి !

-

విమ‌ర్శ‌నాత్మ‌క ధోర‌ణిలోనో లేదా వ్యంగ్య ధోర‌ణిలోనో చెప్పాలంటే సామాజిక బాధ్య‌త అతి ఎక్కువ‌గా ఉన్న చిత్ర సీమ‌కు కొత్త బాధ్య‌త ఒక‌టి స‌వాలుగానే మార‌నుంది. అస్స‌లు సామాజిక బాధ్య‌త అన్న‌ది ఏ విధంగా ఉందో చూసేందుకు అయినా మ‌న లీడ‌ర్ల‌తో పాటు క‌థానాయ‌కులు కూడా ఎంట్రీ ఇస్తే అదిరిపోతుంది క‌దా!

ఇది కూడా వ్యంగ్యార్థంలోనే చ‌దువుకుని తీరాలి. ఎందుకంటే మ‌న ఇండ‌స్ట్రీ ఇప్పుడు రెండు ప్రాంతాల‌లో ఉంది. ఆంధ్రా ను ఆదాయ మార్గంగా చేసుకుని, తెలంగాణను షూటింగ్ స్పాట్స్ కు కేంద్రంగా చేసుకుని ఉత్ప‌త్తి అక్క‌డ వ్యాపార అభివృద్ధి ఇక్క‌డ అన్న విధంగా ఉంది. వాస్త‌వానికి అది కూడా త‌ప్పు కాదు. ఎందుకంటే మొద‌ట్లో కేసీఆర్ ఎంత‌గానో తెలుగు చిత్ర సీమ‌కు స‌హక‌రించారు. అదేవిధంగా ఏ క‌ష్టం వచ్చినా ఆదుకుంటాన‌ని కూడా చెప్పారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు హ‌యాంలో స్టూడియోల నిర్మాణానికి స్థ‌ల ప‌రిశీల‌న జ‌రిగినా ఎందువ‌ల్ల‌నో సంబంధిత ప్ర‌క్రియ ముందుకు వెళ్ల‌లేదు.

దీంతో చిత్ర సీమ విశాఖకు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశాలు పూర్తిగానే త‌గ్గిపోయాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక సీన్ మారుతుంద‌ని ఆశించారు కానీ అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయి. త‌రువాత టికెట్ వ్య‌వ‌హారాల నేప‌థ్యంలో చిరుతో భేటీ అయిన జ‌గ‌న్ కొన్ని సూచ‌న‌లు చేశారు. అదేవిధంగా చిరు బృందానికి స్థ‌లాలు కేటాయిస్తామ‌ని కూడా చెప్పారు. అంతేకాకుండా టికెట్ రేట్ల మార్పు విష‌య‌మై స‌వ‌రించిన జీఓ ప్ర‌కారం ఇర‌వై శాతం వ‌ర‌కూ షూటింగ్ లు ఇక్క‌డే జ‌రుపుకోవాల‌ని కూడా నిబంధ‌న ఇచ్చారు. ఈ ష‌ర‌తు అమ‌లు కావాలంటే ఇండ‌స్ట్రీ నుంచి చొర‌వ అవ‌స‌రం. స్థానిక కళాకారుల‌ను ప్రోత్స‌హించాల‌న్న ఆలోచ‌న ఇంకా అవ‌స‌రం. కానీ ఎందుక‌నో ఇండ‌స్ట్రీ అక్క‌డే ఉండిపోతోంది.

ఇక తాజా వివాదానికే వ‌ద్దాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణను వ్య‌తిరేకిస్తూ చాలా ఉద్య‌మాలు న‌డుస్తున్నాయి. ఒక్క‌టంటే ఒక్క ఉద్య‌మానికి కూడా ఇండ‌స్ట్రీ మద్ద‌తు ప‌ల‌క‌లేదు. అప్పుడెప్పుడో లోక్ స‌త్తాకు మ‌ద్ద‌తు ప‌లికిన రాజ‌మౌళి అయినా ఈ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లుకుతారేమో అన్న ఆశ ఒక‌టి క‌నిపిస్తోంది. ఆర్ నారాయ‌ణ మూర్తి మ‌ద్ద‌తు ప‌లికినా అది పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయింది. చిరు లాంటి అగ్ర హీరోలు సామాజిక బాధ్య‌త‌తో ముందుకు వ‌స్తే ఫ‌లితం ఉంటుంది కానీ ఈ విష‌య‌మై ఆయ‌న కూడా నిశ్శ‌బ్దం అయిపోతున్నారు. మ‌న‌తో పోలిస్తే త‌మిళ నాట హీరోలు ఎంతో సామాజిక బాధ్య‌త‌తో ఉంటారు. కానీ ఇక్క‌డ అటువంటివి ఆశించ‌డ‌మే అత్యాశ.

Read more RELATED
Recommended to you

Latest news