పచ్చని సీమ ఇవాళ ఎలా ఉంది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏంటి వైపరీత్యం.. వీటి గురించి ఆలోచించి, వివేకంతో ఓ నిర్ణయం తీసుకుని ప్రజల మధ్య సఖ్యత పెంచాల్సింది ఎవరు ? రాజకీయ నాయకులు. ఆ మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టడంతోనే వివాదమా లేదా అదొక సాకు మాత్రమేనా ! ఇది కూడా ఆలోచించండి ! ఏం కాదు రాజకీయాలకు బలి అయిపోయిన సామాన్య ప్రజలకు ఏ విన్నపం మీరు ఈ కొట్లాటలలో ఇరుక్కుపోవద్దు. ప్రాణ త్యాగం చేయాల్సిన పనేం లేదు. హాయిగా మీ ప్రభుత్వాస్పత్రి ఎలా ఉంది మీ ఊరి రోడ్డు ఎలా ఉంది మీ ఇంటి దగ్గరి బడి, పిల్లల బడి (అంగన్వాడీ) ఎలా ఉంది వీటి గురించి తెలుసుకుని ఇవి బాగాలేకపోతే ఉద్యమం చేయడం మరువకండి. అంతేకానీ ఓ మహనీయుడు పేరు పెట్టినంతనే కేవలం ఓ వర్గం కోపం ఓ వర్గం భయం ఇవన్నీ నెత్తిన పెట్టుకుని ఊరేగించాల్సిన అవసరం లేదు.
కోనసీమ ప్రజలు చాలా మంచివాళ్లు. మర్యాదస్తులు. ఎవ్వరినీ ఏమీ అనరు. తమని తాము ప్రేమిస్తూ చుట్టూ ఉన్న పల్లెతల్లినీ ప్రేమించే మంచి మనుషులు. కేవలం ఈ కొట్లాటలతో మీ పేరు చెడగొట్టుకోకండి. ఒకవేళ ఈ ఉద్రిక్తతలకు మీకు తెలిసిన వారే ఆద్యులే అయినా వారికి మీరు సహకరించకండి. జాగ్రత్త ! మిమ్మల్ని రాజకీయం వాడుకుని వదిలేస్తుంది. పేరు ఉంచాలా తీసేయ్యాలా అన్నది పెద్ద ఇష్యూ కాదు.. మీలో మంచి మనిషి ఉన్నాడా లేడా అన్నది ఇంపార్టెంట్. ఆ మహనీయుని పేరు ఆ జిల్లాకు పెట్టిన నేపథ్యంలో కొంత విభేదం ఉండవచ్చు కానీ, ఆ నిర్ణయాలను వ్యతిరేకించే విధానం మాత్రం ఇది కాదు.
ప్రజలారా ! ఇప్పటికే రెండేళ్ల కరోనా కారణంగా ఎవ్వరికీ ఆశించిన ఆర్థిక ఎదుగుదల లేదు. ఇప్పటికే చాలా సమస్యలు వెన్నాడుతున్నాయి. పేరు వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మీరు ఆగ్రహాలను వ్యక్తం చేయాల్సింది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కాదు.. మీ ఊరి సమస్యలపై పోరాడండి. స్వార్థ రాజకీయాలకు బలి కావొద్దు. మీరంతా మంచోళ్లు కనుక మీ పేరు మీ ఊరు పేరు అన్నీ అన్నీ ఇంకొంత కాలం మంచి అనే జాబితాలోనే ఉండాలి. కనుక సంయమనం పాటించడం మరువవద్దు.