ఎడిట్ నోట్: ‘ఇదేం ఖర్మ’ వైసీపీకి అలెర్ట్.!

-

అధికార పార్టీ విధానాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై, పాలనపై పోరాటాలు చేయడం ప్రతిపక్ష పార్టీలకు పరిపాటే. ఇలా పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని నడిపే అధికార పార్టీ వైఖరిని ప్రజలకు అర్ధమయ్యేలా చేసి..అధికార పార్టీని నెగిటివ్ చేసి, రాజకీయంగా సక్సెస్ అవ్వడమే ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడ. అయితే ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ అదే రేంజ్‌లో కౌంటర్ ఇవ్వాలి..అప్పుడే ప్రతిపక్షం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి పెద్దగా వెళ్లవు. అధికార పార్టీకి పెద్ద నష్టం జరగదు.

అయితే 2019 ఎన్నికల ముందు ఏపీలో అధికారంలో టీడీపీపై…అప్పటి ప్రతిపక్ష వైసీపీ గట్టిగా పోరాటాలు చేసి సక్సెస్ అయింది..అందుకే ఎన్నికల్లో సత్తా చాటింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అదే తరహాలో పోరాటాలు చేస్తుంది. కాకపోతే వైసీపీ ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇవ్వడం,ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టి అసలు అంశాన్ని పక్కకు వెళ్ళేలా చేయడం, ప్రతిపక్ష నేతలని పోలీసులు అడ్డుకోవడం, కేసులు పెట్టడం లాంటివి చేయడం ద్వారా..ఈ మూడున్నర ఏళ్లలో ప్రతిపక్ష టీడీపీ చేసిన కార్యక్రమాలు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు..వైసీపీకి అనుకున్న మేర నెగిటివ్ పెరగలేదు.

కానీ నిదానంగా ఆ పరిస్తితి మారుతున్నట్లు కనిపించింది..వైసీపీ నేతలు తిడితే..టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో తిడుతున్నారు..ఇక పోలీసు కేసులకు, అరెస్టులకు ఇంకా భయపడటం లేదు. ఒకవేళ జైలుకెళితే పోలిటికల్ గా మైలేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. దీని వల్ల టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ పెరుగుతుంది. తాజాగా చంద్రబాబు, కర్నూలు జిల్లా పర్యటన చూస్తే ప్రజలు కాస్త టీడీపీ వైపుకు వస్తున్నారా? అనే డౌట్ వస్తుంది.

అయితే చంద్రబాబుని వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారు గాని..ఆయన్ని తక్కువ అంచనా వేయడం వైసీపీకే ప్రమాదం. ఇప్పుడు మళ్ళీ ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది జగన్ 175 కాన్సెప్ట్‌కు కౌంటర్. 98 శాతం హామీలు అమలు చేశామని, 90 శాతం కుటుంబాలకు పథకాల ద్వారా లబ్ది చేకూరిందని, ప్రజలకు మనం మంచి చేస్తున్నామని, కాబట్టి 175కి 175 సీట్లు గెలవాలని జగన్ అంటున్నారు.

దానికి కౌంటరుగా ఇదేం ఖర్మ ప్రోగ్రాం ద్వారా..అంతా ఆనందంగా ఉన్నారని వైసీపీ చెబుతోంది..కానీ ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారి జీవనం ఎంత దుర్భరంగా మారిందన్నది ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రజలకు చూపించాలని ఫిక్స్ అయింది. దీని ద్వారా వైసీపీపై నెగిటివ్ పెరిగేలా చేసి..రాజకీయంగా ఎదగడమే టీడీపీ కాన్సెప్ట్.

అయితే ఎప్పటిలాగానే బాబుని నాలుగు తిట్లు తిట్టి, జనమంతా మనవైపే ఉన్నారని, బాబు ఏం చేయలేరని వైసీపీ నేతలు భావిస్తే తప్పులో కాలు వేసినట్లే. కాబట్టి ఇదేం ఖర్మ అంటే కామెడిగా తీసుకోకుండా వైసీపీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news