వైసీపీ అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ..వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమించారు. ఆ 50 ఇళ్లకు సంబంధించిన పథకాలు అమలు బాధ్యత వాలంటీర్‌దే. అలా రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల వాలంటీర్లని నియమించారు. ఇక ఈ వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సానుభూతిపరులే అని విమర్శలు ప్రతిపక్షాలు చేశాయి. ఈ విమర్శలు నిజమే అన్నట్లుగా కొందరు వైసీపీ నేతలు..వాలంటీర్లలో 90 శాతం వైసీపీ కార్యకర్తలే అని చెప్పుకొచ్చారు.
సరే వాలంటీర్లు ఎవరు అనేది ప్రజలకు క్లారిటీ ఉంది..ఆ విషయం పక్కన పెడితే..వాలంటీర్లు పథకాల పరంగానే కాదు..రాజకీయ పరంగా వైసీపీకి పూర్తిగా అనుకూలంగా ఉంటూ..వైసీపీకి ప్రజల మద్ధతు పెంచేలా వాలంటీర్లు పనిచేస్తున్నారనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు అంటున్నారు. పంచాయితీ ఎన్నికలు కావచ్చు..పరిషత్, మున్సిపల్ ఎన్నికలు..ఇలా ఏ ఎన్నికలైన ప్రజలు వైసీపీకి ఓటు వేసేలా వాలంటీర్లు బాగా కృషి చేశారని, వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయని కూడా ప్రజలని బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి.
వాలంటీర్లు బెదిరించారో లేదో..ప్రజలకే తెలియాలి. అది పక్కన పెడితే..2024 ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి వాలంటీర్లు కృషి చేయాలని, మంత్రులు , ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి రాకపోతే పథకాలు పోతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు తీసేస్తారని ప్రచారం చేయాలని వైసీపీ నుంచి అంతర్గతంగా సమాచారం వెళ్ళినట్లు కూడా చెబుతున్నారు.
అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల భవిష్యత్ వాలంటీర్ల చేతుల్లోనే ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో టీడీపీ వస్తే వాలంటీర్లని కూడా తీసేస్తారని వైసీపీ ప్రచారం చేస్తుంది. అంటే వాలంటీర్ల ఓట్లు కూడా పోకూడదని వైసీపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వాలంటీర్లతోనే వైసీపీ రాజకీయం చేయాల్సిన పరిస్తితి ఉందని, వారే వైసీపీని అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకంతో నేతలు ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి వాలంటీర్లు వైసీపీకి ఏ మాత్రం విజయం సాధించి పెడతారో.