ఈ రోజు తెలంగాణ లోని వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రము అభివృద్ధి కోసం పలు హామీలను ఇచ్చారు. ఈ సందర్భంగా అధికార పార్టీ మరియు బీజేపీ నాయకుల మధ్యన పరస్పర సవాళ్లు విమర్శలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలను గుప్పించారు. ముందుగా తమ రాష్ట్రానికి వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదములు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ఎప్పుడూ తెలంగాణకు భరోసాగా ఉంటుందన్న నమ్మకాన్ని మరోసారి తెలంగాణ ప్రజలకు కలిగించిందని తెలిపారు. ఈటల మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నెన్నో హామీలను కల్లబొల్లి కబుర్లుగా చెప్పి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు హామీలు తీర్చకుండా ప్రజల కళ్ళలో మట్టి కొడుతున్నారని కేసీఆర్ ను విమర్శించారు.
ఇటువంటి సీఎం ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈటల. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారు తెలంగాణను ప్రజలకు చూపించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు.