బీజేపీలో చేరిన ఈటల రాజేందర్

న్యూఢిల్లీ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ జాతీయ కేంద్ర కార్యాలయంలో ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాషాయ కండువా కప్పారు. ఈటలకు సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దగ్గర ఉండి మరీ ఈటలను బీజేపీలోకి ఆహ్వానించారు. ఈటల రాజేందర్ ఇప్పటికే జాతీయ నేతలతో మంతనాలు జరిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ కమలం గూటికి చేరారు.

కాగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను అటు స్పీకర్ ఆమోదించారు. తుర్కయాంజల్ భూముల వివాదంలో ఈటల రాజేందర్ మంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.