ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. సామాజిక మాధ్యమాలలో ఆయన ఏం వ్యాఖ్యలు చేసినా అవి వైరల్‌గా మారుతుంటాయి. ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలపై తీరుపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకుంటున్నాయని ఆయా సామాజిక మాధ్యమాలపై మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యం సమర్థంగా పని చేయాలంటే భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరం. ట్విట్టర్ దీనిని పాటిస్తోందా?’ అనే అంశంపై మస్క్ ఇటీవల కాలంలో పోల్ నిర్వహించారు. దీనిలో మొత్తం 20,35,924 మంది పాల్గొని, తమ అభిప్రాయాలను తెలిపారు. వీరిలో 70.4 శాతం మంది ‘‘లేదు’’ అని, 29.6 శాతం మంది ‘‘అవును’’ అని పేర్కొన్నారు. తాజాగా ఆయనను కొత్త సోషల్ మీడియా యాప్ తీసుకు రావాలని ఓ ఫాలోవర్ అడిగారు. తాను దీనిపై ఆలోచిస్తున్నానంటూ ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. దీంతో ఆయన త్వరలోనే ఓ కొత్త యాప్ తీసుకు వస్తారంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రూత్ పేరుతో సోషల్ మీడియా యాప్ తీసుకొచ్చారు.