ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టిన ఈ పేసర్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0) ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. మరో ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్న షమీ కూడా రాణించి మరుసటి ఓవర్లోనే బెన్ స్టోక్స్ (0)ను డకౌట్‌గా వెనక్కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదకరమైన బెయిర్‌స్టో (7)ను కూడా బుమ్రా అవుట్ చేశాడు. ఆ వెంటనే బిగ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టన్ (0)ను బౌల్డ్ చేశాడు. దీంతో 27 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ బట్లర్ (30), మొయీన్ అలీ (14) కాసేపు నిలబడినట్లే కనిపించారు.
కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఈ జోడీని విడగొట్టాడు. అలీని ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేసిన కాసేపటికే బట్లర్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు. చివర్లో డేవిడ్ విల్లే (21), బ్రైడన్ కార్సె (15) కాసేపు పోరాడారు. కానీ మరోసారి బంతి అందుకున్న బుమ్రా.. కార్సేను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే విల్లేను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 25.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 110 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా తన కెరీర్‌లోనే బెస్ట్ వన్డే బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. మొత్తం ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ 3 వికెట్లతో సత్తా చాటగా.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీసుకున్నాడు.