ఖమ్మంలో అశేష ప్రజానికం మధ్య నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభను చూసిన ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సభపై అవాకులు, చెవాకులు పేలుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం సభ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయ్యిందని, జాతీయ నాయకుల రాకతో బీఆర్‌ఎస్ కు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. దేశంలో రైతుకు న్యాయం చేసే ఏకైక నాయకుడు కేసీఆర్ అని దేశ ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.
మోడీ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే, సీఎం కేసీఆర్ కన్న తల్లి, తండ్రిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు భరతం పట్టడం ఖాయమని అన్నారు . ప్రతిపక్షాలకు దమ్ము, ధైర్యముంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాలు విసిరారు.మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ గాలికి ఒదిలేసిదని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఎందుకు నిలదీయరని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
రాజకీయ అనుభవం లేని బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోవాలని హితవుపలికారు. చిల్లర మాటలతో జాతీయ నేతలను అవమానించడం మంచి సంస్కారం కాదని సూచించారు. ‘ రాష్ట్రంలో 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకో ’ తెలుస్తుందని అన్నారు. అంతేకాకుండా.. బండి సంజయ్‌కు వెంట్రుకలే కాదు మెదడు కూడా లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.