ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో పెద్ద సంచలనం అయింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు ఈ రోజు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక హుజూరాబాద్‌లో సమరమే అంటూ స్పష్టం చేశారు. కాగా ఈటల రాజీనామా చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఉద్యమ సమయంలో కూడా రెండు సార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆయన. అప్పుడు కేసీఆర్ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.
టీఆర్ఎస్ మొదట్లో ఆయన హైదరాబాద్, గజ్వేల్ ఏరియాల్లో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ ఆదేశాల మేరకు కమలాపూర్‌కు వెళ్లి గులాబీ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. 2004లో మొదటి సారి కమలాపూర్ నుంచి పోటీచేసి అప్పటి మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి మరీ విజయఖేతనం ఎగరేశారు.
అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత 2008, 2010లో కూడా తన ఎమ్మెల్యే పదవికి ఉద్యమం కోసం రాజీనామా చేశారు ఈటల రాజేందర్. ఆ రెండు ఉప ఎన్నికల్లోనూ విజయ జెండా ఎగరేశారు. ఇప్పుడు మూడోసారి రాజీనామా చేసి సంచలనంగా మారారు. అయితే తెలంగాణ వచ్చాక రాజీనామా చేసిన మొదటి ఎమ్మెల్యేగా ఈటల రికార్డు సృష్టించారు. మరి ఈ ఉప ఎన్నికల్లో కూడా గెలిచి తనకు ఎదురు లేదని నిరూపించుకుంటారో లేదో చూడాలి.