పదవి ఉంటే హడావిడి..ప్రత్యర్ధులని పొడిచేస్తామనే విధంగా బీరాలు పలకడం…ఎప్పుడుపడితే అప్పుడు మీడియా ముందుకు రావడం…ప్రతిపక్షంపై విమర్శలు…జగన్ పై పొగడ్తలు. మంత్రి పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే విధంగా రాజకీయం చేస్తూ వస్తున్నారని చెప్పొచ్చు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే జరిగింది.
ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే జరుగుతుంది…మంత్రులు అనే వారు ప్రతిపక్షాన్ని తిట్టడానికి, సీఎంని పొగడానికి అన్నట్లే ఉన్నారు. అయితే ఇదంతా పదవులు ఉన్నప్పుడే…పదవి పోతే మాత్రం అడ్రెస్ ఉండరు..మళ్ళీ సీఎంకు సపోర్ట్ గా మాట్లాడటం తక్కువగా ఉంటుంది. ఈ మార్పు ఈ మధ్య మాజీలు అయిన మంత్రుల విషయంలో బాగా కనిపిస్తోంది. అసలు మంత్రులుగా ఉన్నప్పుడు చెలరేగిపోయిన వారు..పదవి పోగానే అద్రీస్ ఉండటం లేదు. ఏదో ఒకరిద్దరు తప్ప…మిగిలిన వారు పోలిటికల్ స్క్రీన్ పై కనిపించడం లేదు.
మాజీలు అయిన వారిలో కొడాలి నాని, పేర్ని నాని లాంటి వారే కాస్త మీడియాలో కనిపిస్తూ…ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ…జగన్ కు అండగా నిలబడుతున్నారు. కానీ మిగిలిన మాజీలు పెద్దగా కంటికి కనిపించడం లేదు. అసలు మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దూకుడు ఎలా ఉండేదో చెప్పాల్సిన పని లేదు. కానీ మాజీ అయ్యాక సైలెంట్ అయ్యారు. ఏదో ప్లీనరీ సమావేశంలో గట్టిగా మాట్లాడరు తప్ప…మిగతా సమయంలో కనబడటం లేదు.
అటు కన్నబాబు గాని, అవంతి శ్రీనివాస్ గాని అడ్రెస్ లేరు. ఇక మంత్రిగా ఉన్నప్పుడు, మాజీ అయ్యాక కూడా ఆళ్ళ నాని సైలెంట్ గానే ఉంటున్నారు. మాజీ హోమ్ మంత్రి సుచరిత, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి కంటికి కనబడటం లేదు. ఇంకా మాజీ మంత్రులు శంకర్ నారాయణ, ధర్మాన కృష్ణదాస్ లాంటి వారు కూడా సైలెంట్ అయ్యారు. జగన్ తో సన్నిహితంగా ఉండే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం దూకుడుగా ఉండటం లేదు. మొత్తానికైతే మాజీలు అయ్యాక సైలెంట్ అయిపోయారు.