నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు అరవింద్ ఇంటిపై దాడి చేశారు. జూబ్లీహిల్స్ లోని అరవింద్ నివాసంలోకి చొరబడ్డ టిఆర్ఎస్ కార్యకర్తలు కిటికీలు, అద్దాలు పగలగొట్టారు. ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బిజెపి కార్యకర్తలు ఒక్కరొకరిగా అక్కడికి చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి.. అరవింద్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. అనంతరం అక్కడి నుండి టిఆర్ఎస్ భవన్ ముట్టడికి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ ఇంటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. బిజెపి శ్రేణులను తెలంగాణ భవన్ లోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.