రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ హాస్పిటల్ లో ఈ నెల 25వ తేదీన 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. వారిలో 26, 27 తేదీల్లో ఆపరేషన్ చేయించుకున్న మహిళల్లో నలుగురు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. సీతారాంపేటకు చెందినన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక, మరో ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే తాజాగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ నిబంధనలలో మార్పులు చేస్తున్నామని తెలిపారు అజయ్ కుమార్ ( తెలంగాణ వైద్య విధాన పరిషత్).
ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ నిలిపివేశామని తెలిపారు. ఒక రోజుకు 10 నుంచి 15 ఆపరేషన్స్ మాత్రమే చేసేలా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో 17 మంది అబ్జర్వేషన్ లో ఉన్నారని.. వారిలో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉండగా.. మిగతా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. మరణించిన వారి పోస్ట్మార్టం రిపోర్ట్ రావడానికి ఇంకా టైం పడుతుందన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు రానున్నట్లు తెలిపారు. ఇకమీదట సిస్టమేటిక్ పద్ధతిలో ఆపరేషన్స్ చేస్తామన్నారు అజయ్ కుమార్.