రాజకీయాల్లో వారసులకు కొత్తకాదు. వ్యాపారాల్లో మాదిరిగానే రాజకీయాల్లోకి కూడా వారసుల ఎంట్రీ ఇటీవ ల కాలంలో ఎక్కువగానే ఉంటోంది. అయితే, ఇప్పుడు మరింత ఎక్కువగా విశాఖలో వారసుల పేర్లు వినిపి స్తున్నాయి. గతంలో ఒకరిద్దరు మాత్రమే రాజకీయ వారసులుగా ఉంటే.. ఇప్పుడు ప్రతి నియోజకవ ర్గంలోనూ వారసులు తెరమీదికి వస్తున్నారు. దీంతో వారసులు లేని నియోజకవర్గం అంటూ లేకుండా పోతోంది. జిల్లాలో సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ తన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌ను తెరమీదికి తెచ్చారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పలనర్సయ్య టీడీపీ రాజకీయాల్లో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పీవీజీ గణబాబు ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మేల్యేగా ఉన్నారు. తాజాగా గణబాబు కుమారుడు కూడా రాజకీయ ప్రవేశం చేస్తారనే ప్రచారం సాగుతోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ గురునాథ్‌రావు కుమారుడు గుడివాడ అమర్‌నాథ్ టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీసీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు.
2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్, మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె జీవీఎంసీ బరిలో ఉండగా, మాజీ మంత్రి బాలరాజు కుమార్తె స్థానిక సంస్థల బరిలో నిలిచారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు కుమారుడు సుకుమార వర్మ డీసీసీబీ అధ్యక్షుడిగా ఉన్నారు. గాజువాక మాజీ ఎమ్మేల్యే పల్లా శ్రీనివాస్ కూడా మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం వారసుడిగానే రాజకీయాల్లోకి వచ్చారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు నర్సీపట్నంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. గత ఎన్నికల్లోనే టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, కుదరలేదు.
ఇక బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. గీతం వర్సిటీ వ్యవస్థాపకుడు ఎంవీవీఎస్ మూర్తి వారసుడిగా ఆయన మనవడు శ్రీ భరత్ 2019 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. మరో సీనియర్ నేత అడారి తులసీరావు కుమారుడు ఆనంద్ కూడా టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఇక, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ కూడా రేపో మాపో.. రాజకీయాల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈయన వైసీపీతో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బాలరాజు కూడా తమ కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇలా మొత్తంగా విశాఖలో వారసుల రాజకీయం ఊపందుకుంటోంది. దీంతో కొత్తవారికి ఛాన్స్ లేకుండా పోతోందని అంటున్నారు పరిశీలకులు.