మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు. నాందేడ్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ప్రధానులు మారారు కానీ ఈ దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని అన్నారు. దేశంలో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో కష్టపడి పంటలు పండించిన రైతుల ఆత్మహత్యలు తప్పట్లేదు అని తెలిపారు. అందుకే “ఆబ్ కి బార్.. కిసాన్ సర్కార్” తో బిఆర్ఎస్ వచ్చిందన్నారు.
మంచి రోజులు వస్తాయని ఎన్నాళ్లో ఎదురు చూసామని.. ఇప్పుడు సమయం వచ్చిందన్నారు. నాగలి పట్టే చేతులు శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికలలో గెలవాల్సింది నేతలు కాదని.. ప్రజలు, రైతులు గెలవాలని స్పష్టం చేశారు. దేశ దుస్థితిని చూసిన తర్వాత ఈ స్థితిని మార్చాలని సంకల్పించామన్నారు. మా సంకల్పానికి దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు.